Saturday, November 21, 2009

మూడవ మకాము - అద్భుత మంచము కథ - 5

అంత పొద్దున్నే సభకు రాజు రావటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
రాజు తన మంత్రులను పిలిచి,
"ప్రశ్నించకుండా నా వెంట రండి",
అని చెప్పి పట్టణం బయటి కాళికాలయానికి తీసుకువెళ్లాడు.
ఆ దేవికి నమస్కరించి గుడిలో ఒకమూలన ఉన్న
ఖడ్గం అందుకుని కొలువుకు తిరిగివెళ్లాడు.
ఈ వింత చూసిన సభలోని ప్రజలు విస్మయం చెందారు.

రాజు సింహాసనం మీద ఆసీనుడైన కొద్దిసేపటికి
వలలు, చిక్కాలు, విల్లంబులతో కొంతమంది
వేటగాళ్లు వచ్చారు. శత్రుంజయుడికి మొక్కి,
"మహారాజా, వేటలో మేము నేర్పరులము.
మా శక్తి, చాతుర్యం పరీక్షించి మీ దగ్గర చేర్చుకోమని
అడగటం కోసం వచ్చాము",
అని విన్నవించారు. వెంటనే వాళ్లని బంధించమని
రాజు తన భటులకు ఆజ్ఞ ఇచ్చాడు.
వాళ్లను వెతికిచూసిన భటులకు రహస్యంగా
దాచిన ఖడ్గాలు కనపడ్డాయి. కొద్దిగా బెదిరించగానే
వాళ్లు తమ మోసం ఒప్పుకున్నారు. ఇదంతా
రాజుకెలా తెలిసిందా అని అందరూ తెల్లబోయారు.

శత్రుంజయుడు ఆ దుర్మార్గులను చెరసాలలో వేయించి
మధ్యాహ్నం అవుతుండగా అంతఃపురం చేరాడు.
రాజుకేమీ తెలియదనుకుని అతడి భార్య అతి వినయంతో
ఉపచారాలు చేసి భోజనం తెప్పించింది.
రాజు ఆ అన్నం తినకుండా కొన్ని మెతుకులు ఒక కాకికి వేశాడు.
ఆ కాకి అవి తిని క్షణాలలో గిరగిర తిరిగి పడి ప్రాణాలు విడిచింది.
రాణి ఏమీ తెలియనట్లు ఆశ్చర్యం, భయం నటించబోయింది.
రాజు వెంటనే తన భటులను పిలిచి,
"ఈ విషపు అన్నంతో నన్ను చంపటానికి ప్రయత్నించి
ఏమీ ఎరుగని నిరపరాధినని అబద్ధం చెబుతోంది.
ఈ పాపాత్మురాలిని బంధించి సభకు తీసుకురండి",
అని కఠినంగా ఆజ్ఞాపించి కొలువు వైపు వెళ్లిపోయాడు.

బందీగా వచ్చిన రాణిని చూసి సభ ఆశ్చర్యపోయింది.
ఆమె తనకు పెట్టిన భోజనాన్ని శత్రుంజయుడు ఒక కుక్క ముందు ఉంచి
అది తిని ఆ కుక్క చనిపోవటం ప్రజలందరికీ చూపించాడు.
గుర్రపువాడిని పిలిపించి వాడి చేత కూడా సభలో నిజం చెప్పించి,
దేశం నుండి బహిష్కరించాడు. రాణిని నీళ్లు చల్లిన సున్నపురాళ్ల మీద
వేసి చంపవలసిందని ఆజ్ఞ ఇచ్చాడు.

తర్వాత రాజు నాలుగురోజులు గడిపి ఐదవరోజు నమ్మకమైన తన మంత్రిని పిలిచాడు.
పాము కాటు వల్ల కలగబోయే మరణం గురించి చెప్పి దానికి విరుగుడుగా పనిచేసే
తీగను ఉద్యానవనంలో చూపించాడు. ఇద్దరూ తిరిగివస్తూండగానే ఒక త్రాచుపాము
రాజును కాటువేసి వెళ్లిపోయింది. రాజు అక్కడికక్కడే కిందపడిపోయాడు.
స్వామిభక్తిపరాయణుడైన మంత్రి రాజు చెప్పిన తీగను వాడి రాజును కాపాడాడు.

రాజు సభకు తిరిగివచ్చి, రాత్రి జరిగిన విషయాలు,
అద్భుత మంచం ప్రభావం గురించి సభకు తెలియజేశాడు.
ఇంతటి మహిమ ఉంది కాబట్టే అంత వెల చెప్పాడు అని
అందరూ ఆ కంసాలి నేర్పును కొనియాడారు.

రాత్రి విన్న వృత్తాంతం ప్రకారమే నగరమధ్యంలో ఒక
రాతి స్తంభం నాటి దాని మీద ఆ ఖడ్గాన్ని ప్రతిష్ఠించాడు శత్రుంజయుడు.
ఆ మంచం సహాయంతో ఎంతో కాలం మంచి రాజ్యపాలన చేశాడు.
అతడు చనిపోగానే ఆ మంచం కూడా అదృశ్యమైంది.

కొన్ని తరాల తర్వాత ఈ ఊరి ప్రజలు ఇలా ఉన్నారు.
గుణాకరా, ఇదే నువ్వు చూసిన రాతిస్తంభం వృత్తాంతం",
అని కథ ముగించాడు.

తర్వాత గురుశిష్యులు కొంత ప్రయాణం సాగించి
ఒక భయంకరమైన అరణ్యంలో ప్రవేశించారు.
అక్కడ చుట్టూ చెట్లతో ఒక తేట నీటి కొలను
ఉండటం చూసి దాని పక్కనే బస చేశారు.

Saturday, November 14, 2009

మూడవ మకాము - అద్భుత మంచము కథ - 4

నాలుగో జాము ప్రారంభమైంది.
జాము ముగిసే సమయానికి ఆఖరి కోడు తిరిగి వచ్చి,
"నేను ఊరంతా తిరిగి ఉత్తరపు దిక్కులో ఉన్న రాజుగారి గుర్రపు శాల పక్కగా వెళ్తున్నప్పుడు
మాటల శబ్దం వినపడింది. అది ఒక స్త్రీ ఒక పురుషుడితో చేస్తున్న రహస్యసంభాషణ అని
అర్థమై వినటం కోసం చాటుగా నిలిచాను. ఆ స్త్రీ,
'మనోహరా, మనం కలవటం చాలా కష్టంగా ఉంది.
ఏం చేయగలను? పాపాత్ముడు, నా మగడు అయిన రాజు
ఒక నెల నుండి రోజూ నా అంతఃపురానికి వస్తుండటం వల్ల
నీ దగ్గరకు రావటం కుదరలేదు. విధిలేక రాజు దగ్గర నటిస్తున్నాను.
నెల రోజుల తర్వాత మళ్లీ మనం కలిసే భాగ్యం లభించింది.
ఈ రోజు ఒక కంసాలి వాడు మంచం ఒకటి తెచ్చి, దానికి అద్భుత శక్తులు
ఉన్నాయని చెప్పాడట. అందువల్ల రాజు ఈ రాత్రి అంతఃపురానికి రాలేదు.
ఎక్కడో ఆ మంచం వేయించుకుని పడుకున్నాడు.
నేను ఈ రాత్రంతా ఆనందంగా గడిపినా వేకువకాలం సమీపిస్తున్నందుకు బాధగా ఉంది.
నిన్ను విడిచిపోక తప్పదు గదా!
', అని చెప్పింది.

ఆ పురుషుడు,
'మనోహరీ, నా కోసం ఎన్ని బాధలు పడుతున్నావో నాకు తెలుసు.
కానీ నీ భర్తను నిందించటం నాకు ఇష్టం లేదు.
రాజైన అతడెక్కడ, గుర్రపువాడినైన నేనెక్కడ?
దైవసంకల్పం వల్ల మనం కలిశాము కానీ,
నీ పాదసేవకైనా నేను అర్హుడిని కాను.
అటువంటి రాజుకు భార్యవైన నువ్వు నాతో ఉండటమే నేరం.
అదిగాక అతడిని ఇలా నిందించటం తగదు
', అన్నాడు.

ఆమె ఈ మాటలు వినలేక,
'ఏమిటీ, నువ్వు హీనుడివా?
ఇకపై అలాంటి మాటలు వద్దు.
నువ్వు నా ప్రియుడివి.
రాజును రెండు మాటలన్నందుకే ఇలా అంటున్నావు.
రేపు రాజు ప్రాణాలుతీసి ఇక నీతోనే ఉండబోతున్నాను.
దీనికేమంటావు?
అతడి భోజనంలో విషం కలపటానికి ఒక పరిచారికను నియమించాను',
అని చెప్పింది.
అలా చేయవద్దని అతడు ఎంత వారిస్తున్నా వినిపించుకోకుండా
అక్కడి నుండి ఆమె వెళ్లిపోయింది", అని చెప్పింది.

ధర్మాత్ముడైన రాజుకు అన్ని గండాలున్నందుకు బాధపడుతూ,
తెల్లవారుతున్నందువల్ల మంచంకోళ్లన్నీ మౌనముద్ర దాల్చాయి.

అవి రాత్రి చెప్పిన వృత్తాంతాలన్నీ వింటూనే ఉండిన రాజు,
అప్పుడే మేలుకున్నవాడిలాగా లేచాడు.
అతడికి ఆశ్చర్యం, బాధ, భయం, కోపం అన్నీ కలిగాయి.
ఏమి చేయాలో నిశ్చయించుకుని పెందలకడనే కొలువు కూటం చేరాడు.

Saturday, November 7, 2009

మూడవ మకాము - అద్భుత మంచము కథ - 3

ఇదే విధంగా మూడవ కోడు కూడా వెళ్లి ఒక జాము గడిచిన తర్వాత తిరిగి వచ్చి,
"నేను చూసింది చెబుతాను వినండి.
తిరిగి తిరిగి పడమటివాడ చేరుకున్నాను. పట్టణమంతా నిశ్శబ్దంగా ఉంది.
అప్పుడు భయంకరమైన ఒక ఆకారం నాకు ఎదురుపడింది.
కనుగుడ్లు గిరగిరా తిప్పుతూ, నెత్తిమీద భగభగలాడే నిప్పులకుంపటి పెట్టుకుని, చేతిలో ఉగ్రమైన ఖడ్గంతో ఉన్న ఆ ఆకృతి చూడగానే అదొక మహాభూతమని నాకు అర్థమైంది. నేను జంకకుండా నిలబడటం చూసి,
'ఎవరు నువ్వు?
వెంటనే దారికి అడ్డం తొలగకపోతే గుటుక్కున మింగేస్తాను.
నేను ఢాకిని అనే భూతాన్ని.
రాత్రిపూట ఈ ఊర్లో ఎవరైనా బయట తిరుగుతూ కనపడితే చంపి తింటూ ఉంటాను.
కానీ వారం రోజులనుండీ ఆహారం దొరక్క ఆకలి మీద ఉన్నాను.
త్వరగా ఎవరినైనా విరిచి తింటేగానీ నా ఆకలి తీరదు.
అడ్డం నిలవకుండా దూరంగా పో
', అని కోపంగా చెప్పింది.
దాని మాటలకు నాకు కోపం వచ్చింది.
'దుష్టభూతమా, ఇదా నువ్వు చేసే పని, ఇప్పుడే నీకు బుద్ధి చెప్పి ఈ పట్టణం వాళ్లకి మేలు చేస్తాను',
అని దాని మీదకు ఉరికాను.
దాని తలమీది కుంపటి కిందికి తోసి గర్వం అణిగేలా దెబ్బలు తగిలించాను.
ఆఖరికి అది నాకు మొక్కి, 'బుద్ధి వచ్చింది, నీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాను', అని లొంగిపోయింది.
దాని దగ్గర ఉన్న ఖడ్గాన్ని ఊరి మధ్యలో ఒక రాతిస్తంభం మీద నిలిపితే ఇక ఈ ఊరికి భూతాల వల్ల భయం ఉండదని కూడా తెలిపింది. నేను దాని చేత ఆ ఖడ్గాన్ని కాళికాలయంలో పెట్టించి తిరిగి వస్తున్నాను. ఆ భూతం ఈ ఊరిని విడిచి ఎటో వెళ్లిపోయింది" అని తన వృత్తాంతం చెప్పింది. ఊరివాళ్లకి భూతం బాధ తప్పించినందుకు మిగిలిన కోళ్లు దాన్ని ఎంతో మెచ్చుకున్నాయి.