Saturday, September 12, 2009

రెండవ మకాము - పేద విప్రుని కథ - 1

మరునాడు గురుశిష్యులు అక్కడికి ఇరవై గడియల దూరంలో ఉన్న
మరో ఊరిబయట శివాలయానికి చేరారు. గుణాకరుడు సమీపాన ఉన్న ఒక చిన్న పల్లెకు
వెళ్లి దినుసులు, సామగ్రి తెచ్చి వంట చేశాడు. యోగానందుడు భోజనం చేసి విశ్రమించాడు.
తరువాత గుణాకరుడు కూడా తిని, పాత్రలు శుద్ధిచేసి వాటికోసం వచ్చిన ఒకడికి ఇచ్చి
తిరిగిపంపాడు. గుణాకరుడు గురువు దగ్గర కూర్చుని, "
స్వామీ, ఈ దేవళం మంచి పనితనంతో దృఢంగా ఉంది.
కానీ ఇందులో శివలింగం కానీ, వేరే చిహ్నం కానీ లేదు.
ఇందుకు కారణమేమిటి", అని అడిగాడు.
అందుకు యోగానందుడు ఇలా చెప్పనారంభించాడు.

గుణాకరా, ఈ ప్రాంతంలో ఇంతకు ముందు ఒక గొప్ప పల్లె ఉండేది.
ఈ శివాలయానికి తూర్పుపడమరలుగా ఒక సన్నిధి వీధి, దానికి రెండువైపులా చిన్నచిన్నవీధులు, వాటిలో వర్తకులు, బ్రాహ్మణుల ఇళ్లు ఉండేవి.
గ్రామంలో అందరూ కొద్దోగొప్పో ధనవంతులే అయినా వేదశర్మ అనే బ్రాహ్మణుడు మాత్రం నిత్యదరిద్రంతో బాధపడేవాడు.
భార్యను, ఐదుగురు పిల్లలను పోషించటానికి రోజూ భిక్షం ఎత్తి దొరికిన చాలీచాలని బియ్యంతోనే తృప్తిగా ఉండేవాడు.

ఈ శివాలయం అప్పట్లో మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు జరుపుకుంటూ ఉన్నతస్థితిలో ఉండేది.
వేదశర్మ రోజూ ఉదయాన్నే ఈ ఆలయానికి నూటయెనిమిది ప్రదక్షిణలు చేసి, తన అక్షయపాత్రతో ఊరిలోకి వెళ్లేవాడు.

ఒకరోజు ఎప్పటిలాగే వేదశర్మ ప్రాతఃకాలాన ప్రదక్షిణ నమస్కారాలు పూర్తి చేసుకుని బయటికి వెళ్లాడు.
అదే సమయానికి గుడివెనుక దంతధావనం చేసుకుంటున్న కుబేరగుప్తుడనే ధనవంతుడికి గుడిలోనుండి కొన్ని మాటలు వినిపించాయి.
దేవళంలో ఈశ్వరుడు పిలిచినట్లు,"నందీ, నందీ", అని వినపడింది.
ఈ వింత ఏమిటో చూద్దామని, కుబేరగుప్తుడు గుడిగోడకు ఆనుకుని చెవులు రిక్కించాడు.
"దేవా, సేవకుడిని, మీ ఆజ్ఞకోసం సిద్ధంగా ఉన్నాను", అని నందీశ్వరుడు చెప్పటం వినపడింది.
"నందీ, మరేమీ లేదు కానీ, నిత్యదరిద్రుడైన వేదశర్మ రోజూ వచ్చి నన్ను సేవిస్తుంటాడు.
పాపం, అతని మీద నాకు చాలా కనికరం కలిగింది.
ఏదైనా సహాయం చేయదలిచాను. కాబట్టి నువ్వు నా ఆజ్ఞ ప్రకారం, నేటి సాయంత్రం లోపల అతడికి పదివేల నిష్కములు చేరేలా చెయ్యి", అని శివుడు పలకటం,
"స్వామీ, తమ ఆజ్ఞ", అని నంది అంగీకరించటం కుబేరగుప్తుడు స్పష్టంగా విన్నాడు.

No comments:

Post a Comment