మరుసటిరోజు ఒక గుర్రపురౌతు సభకు వచ్చి చక్రవర్తికి ఒక ఉత్తరం అందించాడు.
ఆ ఉత్తరంలో,
"మహారాజా, సత్యశీలుడి మంత్రి వసుదేవుడు ఆశీర్వదించి వ్రాస్తున్న విజ్ఞాపన.
మీరు దండెత్తినప్పడు నేను లేకపోవటం వల్ల ఇంత జరిగింది.
నేను ఉండి ఉంటే సుందరీమణిని మీకు అప్పగించమని సలహా ఇచ్చేవాడిని.
మీతో విరోధం మాకు క్షేమం కాదు.
నేటికి ఐదవరోజు మీరు కోరిన రాణిని నేను అప్పగిస్తాను.
విరోధం విడిచి మా రాజును, రాజ్యాన్ని తిరిగి ప్రసాదించమని విన్నపం, వసుదేవుడు", అని ఉంది.
ప్రతాపవర్ధనుడు అది చదివి ఆనందంతో దాన్ని ధనంజయుడికి ఇచ్చి,
"వసుదేవుడు ఈ ఉత్తరం పంపి ఐదు రోజులయింది.
కాబట్టి, ఇప్పటికే రాణితో ఊరికి చేరి ఉంటాడు.
మనం బయలుదేరుదాం పద", అని కొలువు చాలించాడు.
చక్రవర్తి అలంకరించుకొని సిద్ధమై ఉండగా, ధనంజయుడు అక్కడికి వచ్చి,
"ప్రభూ, వసుదేవుడు ఊరి బయట ఉన్నానని వార్త పంపాడు.
మీ వెంట పరివారం చాలా తక్కువ ఉండాలనీ, సుందరీమణి ఆడంబరంగా రావటానికి జంకుతోందనీ తెలియజేశాడు.
సత్యశీలుడిని కూడా మనతో తీసుకు వెళ్లి, అతడి ముందే మీరు ఆమెను చేపట్టాలని నా కోరిక", అన్నాడు.
ప్రతాపవర్ధనుడికి కూడా అదే ఇష్టమవటంతో, సత్యశీలుడికి ఒక పల్లకీ ఏర్పాటు చేశాడు.
తమతో ధనంజయుడు, కొద్దిమంది భటులు తప్ప మరెవరూ రాకూడదని ఆజ్ఞాపించాడు.
అప్పటికే రాత్రి అయినా, వసుదేవుడి కోరిక మేరకు దివిటీలు లేకుండానే అందరూ బయలుదేరారు.
ఊరి బయట శివాలయం దగ్గర ఒక మూతపల్లకీతో ఉన్న వసుదేవుడు చక్రవర్తి అక్కడికి చేరగానే,
"మహారాజా, పల్లకీలో సుందరీమణి ఉంది.
ఆమెను స్వీకరించి, మా రాజును మాకు అప్పగించండి", అన్నాడు.
ప్రతాపవర్ధనుడు వెంటనే ఆ పల్లకీలో ఎక్కి కూర్చున్నాడు.
ధనంజయుడు, "చక్రవర్తి పల్లకీని నగరంలోకి తీసుకువెళ్లండి", అని తమతో వచ్చిన బోయీలను ఆజ్ఞాపించాడు.
వాళ్లు సత్యశీలుడున్న పల్లకీని దింపి, ప్రతాపవర్ధనుడున్న పల్లకీని సమీపిస్తుండగా మరుగున ఉన్న కొందరు భటులు వచ్చి వాళ్లను, చక్రవర్తితో వచ్చిన భటులను సంహరించారు.
పల్లకీలో ఉన్న ప్రతావవర్ధనుడికి ఇదేమీ తెలియక, తన పక్కనే ఉన్న స్త్రీ చేతులను అందుకోవటానికి ప్రయత్నించాడు.
ఆమె వెంటనే చక్రవర్తి చేతులకు తన దగ్గర ఉన్న సంకెలలు బిగించింది.
తరువాత తన స్త్రీ వేషం తొలగించి, "పాపాత్ముడా, పరస్త్రీని మోహించి, మా రాజును బంధించినందుకు ఫలం అనుభవించు", అని తాను జయపాలుడన్న విషయం బయటపెట్టాడు. జరిగినదంతా వసుదేవుడి మాయ అని ప్రతాపవర్ధనుడికి అర్ధమై ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాడు.
రాత్రి ప్రయాణం చేసి అందరూ విజయపురం ప్రవేశించారు.
వీరశేఖరుడు కొద్దిమంది భటులతోనే కోటలోకి వెళ్లి శివవర్మను చంపి, పట్టణం వశం చేసుకున్నాడు.
సత్యశీలుడు సింహాసనం అధిష్ఠించి, ప్రతాపవర్ధనుడిని చెరసాలలో బంధించాడు.
గుణాకరా, ఇదంతా నీకు వింతగా తోచవచ్చు.
రహస్యం చెప్తాను విను.
వసుదేవుడు లేని సమయంలో ప్రతాపవర్ధనుడు దండెత్తి విజయపురాన్ని ముట్టడించాడు కదా.
అప్పుడు మంత్రిగా ఉన్న జయపాలుడు వీరశేఖరుడి వేషంలో చక్రవర్తిని మోసం చేసి, సుందరీమణిని బయటికి తరలించటానికి సహాయపడ్డాడు.
పని జరగగానే జయపాలుడు అక్కడి నుండి బయలుదేరి సుందరీమణిని, సత్యశీలుడి స్నేహితుడైన ఒక భిల్లరాజు దగ్గర కొండలలో భద్రంగా దాచాడు. తరువాత వసుదేవుడిని కలిసి జరిగినది వివరించాడు.
ఆ పక్క రోజు, శవాలలో దాక్కున్న వీరశేఖరుడు కూడా వీరిని చేరి, చక్రవర్తి సత్యశీలుడిని కమలాకరపురం చెరసాలలో బంధించాడని తెలిపాడు.
అప్పుడు వసుదేవుడు వీరశేఖరుడిని ధనంజయుడి రూపంలో పంపి, తాను యోగి రూపంలో చక్రవర్తి నగరంలో ప్రవేశించాడు.
ఉత్తరంలో చెప్పిన ప్రకారం జయపాలుడు స్త్రీరూపం ధరించి భటులతో, వసుదేవుడితో ఊరిబయట వేచి ఉన్నాడు.
తరువాత జరిగినదంతా నీకు తెలుసు. ఆ పై వృత్తాంతం విను.
తమ చక్రవర్తి విజయపురంలో బందీగా ఉన్నాడన్న విషయం ప్రతాపవర్ధనుడి మంత్రి విశ్వనాథుడికి తెలిసింది.
ఎంత సైన్యంతో వెళ్లినా వసుదేవుడి జిత్తులను ఓడించి గెలవటం అసాధ్యమని నిర్ణయించి, సంధి కోసం బయలుదేరాడు.
సత్యశీలుడు, వసుదేవుడు విశ్వనాథుడిని గౌరవసత్కారాలతో ఆహ్వానించారు.
విశ్వనాథుడు తన చక్రవర్తి తప్పలను ఒప్పుకొని, తమ రాజ్యాల మధ్య ఇకపై విరోధం ఉండదని ప్రమాణం చేశాడు.
విశ్వనాథుడు నమ్మదగ్గవాడు కాబట్టి, సత్యశీలుడి అనుమతితో వసుదేవుడు ప్రతాపవర్ధనుడిని విడిచిపెట్టాడు.
చక్రవర్తి సత్యశీలుడు చూపిన మర్యాదకు పశ్చాత్తాపపడి, తన పనులకు సిగ్గుపడి, దీనంగా విశ్వనాథుడితో కమలాకరపురానికి తిరిగివెళ్లాడు. తరువాత సత్యశీలుడు సుందరీమణిని తిరిగి విజయపురానికి పిలిపించి, ఆమె కోరిక ప్రకారం, పరస్త్రీ వ్యామోహం ఉన్నవాళ్లు ప్రతాపవర్ధనుడిలా అధోగతి పాలవుతారని తెలిపేలా నువ్వు చూసిన వింతను నగరమధ్యంలో స్థాపించింది. తరువాత ఎన్నో శతాబ్దాలు గడిచి ఆ పట్టణాలన్నీ అంతరించాయి. విజయపురం ఉన్న స్థానంలో ఈ పల్లె ఏర్పడింది. ఆ పట్టణం పోయినా, వారు నిలిపిన లోహవిగ్రహం మాత్రం గుర్తుగా మిగిలిపోయింది", అని ముగించాడు.
Saturday, September 5, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment