Saturday, September 19, 2009

రెండవ మకాము - పేద విప్రుని కథ - 2

అతనికి దుర్బుద్ధి పుట్టి, మనసులో, "ఓహో, బికారి బాపడికి శివుడు పదివేలు ధనం ఇవ్వదలిచాడు.
అది నేడే జరిగేలా ఉంది. నందీశ్వరుడు సాయంకాలంలోగా ఇస్తానని అంగీకరించాడు.
ఏదైనా ఉపాయం వెతికి వేదశర్మకి రానున్న డబ్బును అపహరించాలి", అని ఆలోచిస్తూ
పరుగున ఇంటికి వెళ్లి, భిక్షాటన కోసం ఆ వీధికి రోజూ వచ్చే వేదశర్మ కోసం బయట కాచుకు కూర్చున్నాడు.

వేదశర్మ ఎప్పటిలాగే గ్రామమంతా తిరిగి దొరికిన కొద్ది బియ్యంతో, ఆకలికి పిల్లలు నకనకలాడుతుంటారని, త్వరత్వరగా ఇంటివైపు వెళ్లసాగాడు.
దారిలోనే కాచుకున్న కుబేరగుప్తుడు వేదశర్వ కనపడగానే మహావినయంతో నమస్కరించి,
"స్వామీ, మీ ప్రభావం గురించి ఇప్పుడే తెలిసింది.
నేను ఈ రోజు ఒక గొప్ప దానం చేయదలిచాను.
పరమయోగ్యులైన మీకే ఆ దానమివ్వాలని ఇక్కడ వేచి ఉన్నాను.
ఆ దానానికి మీరే అర్హులు.
మా ఇంటిలోకి దయచేసి దానం పుచ్చుకోండి",
అని కోరాడు.

ఆ వర్తకుడి మాటలు వేదశర్మకు వింతగా తోచాయి.
ఎందుకంటే ఆ ఇంటిముందునుంచి ఎప్పుడు వెళ్లినా, కుబేరగుప్తుడు మహాకోపంతో ఛీకొట్టి,
"పో పో, రోజూ నీకు భిక్షమెవరు పెడతారు?
అందరూ సంసారాలున్నవాళ్లే.
వారివారి కష్టాలెన్నో ఉంటాయి.
శనిలాగా వచ్చి వాకిట నిలుస్తావు.
ఒకసారి చెపితే అర్థం కాదా?
నీకు బుద్ధిలేదు. వెంటనే ఇక్కడినుంచి వెళ్లిపో",
అని నానాదుర్భాషలాడి, ఒక్కనాడు కూడా పిడికెడు బియ్యమైనా ఇవ్వకుండా తరిమేవాడు.
తను బాధపడకుండా, ఇది తన దారిద్ర్యఫలితమని భావించి, కుబేరగుప్తుడు చెప్పేవి నిజాలే అయినా,
తన దుర్దశ వల్ల, రోషానికి పోకుండా, భిక్షం పెట్టినా పెట్టకపోయినా రోజూ అతడి ఇంటితో సహా అన్ని ఇళ్లకూ వెళ్లేవాడు.

ఒక్కరోజు కూడా బిచ్చం పెట్టని ఆ వర్తకుడు ఇప్పుడు వినయంగా ఆహ్వానించి దానం ఇస్తాననటం వేదశర్మకు కలలా అనిపించింది.
ఇదంతా దైవకృప అనుకొని,
"అయ్యా, మహద్భాగ్యం.
మీ ఇష్టం వచ్చినట్లే చేయండి.
కానీ, ముందు నా దగ్గరున్న బియ్యం తీసుకువెళ్లి నా భార్యాపిల్లలకు ఇచ్చి వస్తాను.
వాళ్లు ఆకలితో ఉంటారు",
అని చెప్పాడు.

కుబేరగుప్తుడు చాలా జాలిపడుతున్నట్లు నటించి,
"అయ్యో, పాపం, పసిపాపలు కదా, ఎంత కష్టపడుతున్నారో.
దారిద్ర్యమెంత దుఃఖకరం. స్వామీ, ఈ పనికోసం మీరు వెళ్లనక్కర్లేదు.
అన్నీ నేను చూసుకుంటాను, మీరు లోపల కూర్చోండి.
మీకు కావలిసిన సామగ్రి ఇప్పుడే సేవకుడితో పంపిస్తాను",
అని వేదశర్మ చేయి పట్టుకుని, లోపలికి తీసుకువెళ్లి, ఉన్నతపీఠం పైన కూర్చోబెట్టి,
ఒక సేవకుడితో, నాలుగు ముంతల బియ్యం, తగినంత ఉప్పు, పప్పు, నేయి, నూనె, కూరలు, విస్తళ్లు వేదశర్మ ఇంటికి పంపాడు.

సేవకుడు అలాగే చేసి, "అయ్యగారు రావటానికి కొంత ఆలస్యమౌతుంది. పెద్ద సెట్టి గారింట్లో ఉన్నారు", అని చెప్పి తిరిగివచ్చాడు.
ఆ రోజు వేదశర్మకు సముద్రం పొంగినంత ఆనందం కలిగింది. కుబేరగుప్తుడి ప్రవర్తన దైవలీలగా భావించాడు.
ఇంతలో కుబేరగుప్తుడు ఒక తట్టలో తమలపాకులు, వక్కలు, ఏలకాయలు, లవంగాలు, రెండువేల నిష్కములు తెచ్చి వేదశర్మకు సమర్పించి,
"స్వామీ, మిమ్మల్ని ఇన్నాళ్లూ చులకనగా చూసినందుకు దోషపరిహారముగా అల్పమైన ఈ మొత్తాన్ని స్వీకరించి,
మీ దాసుడినైన నన్ను దీవించండి", అని ప్రార్థించాడు.

రెండువేలను అల్పమైన మొత్తం అంటున్న ఆ వర్తకుడి మాటలు వేదశర్మకు వింతగా తోచాయి.
కుబేరగుప్తుడు కోరినట్లే ఆ ధనం స్వీకరించి, అతడిని ఆశీర్వదించి వేదశర్మ తన ఇంటికి బయలుదేరాడు.
కానీ, కుబేరగుప్తుడి ఇంటివాకిలి దాటాడో లేదో, ఆ వర్తకుడు ఏదో చెప్పటం మరచిన వాడిలా పరుగు పరుగున బయటికి వచ్చి,
"స్వామీ, స్వామీ, ఒక మాట, ఇటు రండి", అని పిలిచాడు.

No comments:

Post a Comment