Saturday, September 26, 2009

రెండవ మకాము - పేద విప్రుని కథ - 3

లోపలికి వచ్చిన వేదశర్మతో,
"స్వామీ, మరేమీ లేదు. ఒక చిన్న విషయం.
ఈ సాయంత్రంలోగా మీకేమైనా ధనలాభం కలిగితే అది నాకు చెందేలాగా ఒక చీటీ రాసి ఇవ్వవలసింది.
నేను ఒక కారణం వల్ల ఇలా అడుగుతున్నాను", అని అన్నాడు.

కపటమెరుగని వేదశర్మ,
"సాయంత్రంలోగా నాకు కలిగే లాభమేముంది?
అయినా, ఇంత ధనమిచ్చిన ఇతడికి ఆ చీటీ రాసివ్వటం ఉచితమే"
అని ఆలోచించి, "సరే, అలాగే రాసి ఇస్తాను", అన్నాడు.

ఆ వర్తకుడు సిద్ధంగా ఉన్న తాటాకు, గంటము తెచ్చి,
"శాలివాహన శకము 436 వ సంవత్సరమునకు సరియైన అక్షయసంవత్సర వైశాఖశుద్ధ దశమి గురువారము
కుబేరగుప్తుడను వర్తక శిఖామణికి వేదశర్మ యనెడి నేను వ్రాసియిచ్చిన యాదాయబాధ్యత విడుదల పత్రము.
యేమనిన నేటి సాయంకాలములోపల యిపుడు వర్తకుని వలన నేను పొందినధనము తప్ప మరి నాకు కలిగెడి
యెట్టిలాభముగాని యీవణిక్శిఖామణికి చెందవలసినదియేకాని, నాకును నావారసులకును యేలాటి బాధ్యతయును
లేదు. ఇది నేను మనఃపూర్వకముగా స్వహస్తముతో వ్రాసియిచ్చిన పత్రము,
వేదశర్మ చేవ్రాలు"
అని పత్రం రాయించుకున్నాడు.
వేదశర్మను ఇంటికి సాగనంపి, సాయంత్రంలోగా ఎనిమిదివేల నిష్కములు వస్తాయని ఎదురుచూడటం మొదలుపెట్టాడు.
వేదశర్మ తన భార్యకు జరిగినదంతా చెప్పి, తన బిడ్డలతో తృప్తిగా తిని, సుఖంగా ఉన్నాడు.

కుబేరగుప్తుడు మధ్యాహ్నం దాకా ఎలాగో గడిపాడు కానీ, తర్వాత అతడి మనసు పరిపరివిధాల ఆలోచించింది,
"అయ్యో! బుద్ధిహీనుడా! నీ ప్రతిభ ఇంతేనా?
దయ్యమో భూతమో దేవళంలో అన్న మాటలు విని చేజేతులా రెండువేలు సమర్పించుకున్నావే!
ఆ డబ్బు వస్తుందని ఏమి నమ్మకం? "
అని తనను తాను నిందించుకున్నాడు.
మళ్లీ వెంటనే,
"ఛీ, గుడిలో పిశాచాలుంటాయా!
శివుడు నందితో అన్న మాటలు స్పష్టంగా విన్నాను కదా.
భగవంతుడు అబద్ధం చెప్తాడా?
ధనం తప్పకుండా వస్తుంది",
అని ఆలోచించి తుదకు ఇలా నిశ్చయించుకున్నాడు,
"సరే! జరగవలసింది జరిగిపోయింది.
ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు.
ప్రయత్నిస్తాను. డబ్బు వచ్చిందా సంతోషం.
లేకపోతే ఇద్దరు మనుషులతో వేదశర్మ ఇల్లు దోపిడీ చేయిస్తాను.
ఇప్పటికి అతడేమీ ఖర్చుపెట్టి ఉండడు".

కుబేరగుప్తుడు సాయంత్రం వరకూ ఇలా కాలం గడిపి, డబ్బు తెచ్చుకోవటానికి సంచులు,
కొంచెం కొబ్బెర, బెల్లం తీసుకొని, పైపంచె కప్పుకొని, సూర్యాస్తమయం అయ్యేసరికి ఎవరికీ తెలియకుండా శివాలయం చేరుకున్నాడు.

No comments:

Post a Comment