Saturday, October 17, 2009

మూడవ మకాము - అద్భుత మంచము కథ - 1

గుణాకరుడు, యోగానందుడు వేకువజామునే బయలుదేరి మధ్యాహ్నానికి ఒక పట్టణం దగ్గరలో ఉన్న వనానికి చేరారు.
గుణాకరుడు పట్టణం నుండి సామగ్రి తెచ్చి, వంట చేశాడు.
యోగి భోజనం చేసి విశ్రమించాడు.
శిష్యుడు కూడా భోజనం చేసి గురువు దగ్గర కూర్చుని,
"మహాత్మా, ఈ ఊరిలో ఒక వింత చూశాను.
అంగడివీధి నుండి రాజవీధికి వచ్చే మార్గంలో రాజసౌధం ఎదురుగా ఒక శిలాస్తంభం పైన ఒక పొడుగాటి రాయి నిలిచి ఉంది.
ఊరివాళ్లను దాని వృత్తాంతం అడిగితే, అది ఎప్పటినుంచో అలాగే ఉందనటం కంటే ఎక్కువ చెప్పలేదు.
మీ దివ్యదృష్టితో దాని కథ చెప్ప ప్రార్థన",
అని అడిగాడు.

యోగానందుడు తన ఆత్మదృష్టితో సర్వం తెలుసుకుని, ఇలా చెప్పనారంభించాడు,
"వత్సా, ఇప్పుడు ఈ పట్టణం పరిపాలించే రాజుకు మూడు తరాల ముందు శత్రుంజయుడనే వాడు ఇక్కడి రాజు.
రాజుకు ఉండవలసిన లక్షణాలన్నీ అతడిలో ఉండేవి.
ఒకరోజు శత్రుంజయుడు కొలువు చేసి ఉన్నప్పుడు ఒక కంసాలివాడు ఒక మంచం తీసుకువచ్చి సభలో ఉంచాడు.
ఆ మంచం విడదీయటానికీ, కావలసినప్పుడు తగిలించి వాడుకోవటానికీ అనువుగా ఉండేలా తయారుచేయటం వల్ల
కంసాలి పెద్దకట్టెలు, అడ్డంగా వేయటానికి చిరుపట్టెలు, కోళ్లు విడదీసి మోపుగా కట్టితెచ్చాడు.
ఇది చూసిన రాజు,
"కంసాలీ, ఈ పనితనంలేని కట్టెలమోపును సభకెందుకు తీసుకువచ్చావు?",
అని అడిగాడు.

అతడు వినయంగా,
"మహారాజా!
ఈ కట్టెలను విడదీసి తగిలిస్తే ఒక మంచం తయారవుతుంది.
చూడటానికి మోటుగా కనపడుతున్నది కానీ దీని ప్రభావం అద్భుతం.
వెల పదివేల వరహాలు.
దీన్ని మీలాంటివారు తప్ప కొనలేరు.
దీన్ని పరీక్షించి చూడండి, దీని మహిమ మీకే తెలుస్తుంది",
అని అన్నాడు.

ఈ మాటలు విని సభలో అందరూ ఆశ్చర్యపోయారు.
ఎగుడుదిగుడుగా ఉన్న ఒక ముతకమంచానికి పదివేల వరహాలా?
వెల ఎక్కువ చేసి ఇచ్చినా రెండు వరహాలు చెయ్యదే అని పకపక నవ్వారు.

ఆ కంసాలి అయినా జంకకుండా,
"దేవరా!
నేను డబ్బులకోసం పొల్లుమాటలు పలకలేదు.
పదివేల వరహాలకు గవ్వ తక్కువైనా ఈ మంచాన్ని అమ్మను.
దీంట్లో వెలకు మించిన మహిమ ఉంది.
మీరు కొనకపోతే ఇంకెక్కడికైనా తీసుకువెళ్తాను",
అని గట్టిగా చెప్పాడు.

అయినా రాజుకు ఈ మాటలు నమ్మబుద్ధికాలేదు.
నవ్వుతూ మంత్రి వంక చూశాడు.
బుద్ధిమంతుడైన మంత్రి,
"అల్పమైన కొయ్యకు ఇంత వెల చెప్పాడని మనం నిరాకరించకూడదు.
దీని మహిమ ఏమిటో మనకెలా తెలుస్తుంది?
ఇది అంత గొప్ప మంచం కాకపోతే దీన్ని సభకు తీసుకువచ్చి పదివేల వరహాలకు అమ్మే సాహసం చేస్తాడా ఈ కంసాలి?
వీడు అబద్ధం చెబుతుంటే ప్రాణాలతో మిగులుతాడా?
ఏదో మహత్యం ఉందనే నాకు తోస్తూంది.
పనితనం లేదని నిరాకరించవద్దు.
సుగుణాలు ఉన్న వస్తువు చూడటానికి వికారంగానే ఉంటుంది.
పరీక్షించాలనిపిస్తే తీసుకోండి", అని చెప్పాడు.

మంత్రి అంత దృఢంగా చెప్పటంతో శత్రుంజయుడు ఆ మంచాన్ని కొన్నాడు.
ఎలా వాడాలో కంసాలి దగ్గర తెలుసుకున్నాడు.
ఆ రాత్రికి ఏకాంతంగా ఈ మంచం మీద తనకు పడక ఏర్పాటు చేయమని సేవకులను ఆజ్ఞాపించాడు.

భోజనం పూర్తిచేసి, రాజు ఆ మంచం మీద పడుకుని, నిద్రకు ఉపక్రమించాడు.







"

No comments:

Post a Comment