రాజు ఆ మంచం మీద పడుకున్నాడు కానీ నిద్రపోలేదు.
నిద్రపోతున్నవాడిలా ఊపిరివదులుతూ ఏమి జరుగుతుందో చూద్దామని ఉన్నాడు.
ఒక జాము రాత్రి గడవగానే ఆ మంచపుకోళ్లు మాట్లాడుకోవటం ప్రారంభించాయి.
ఈ అద్భుతానికి ఆశ్చర్యపోయిన రాజు చెవులు రిక్కించి వినసాగాడు.
ఆ కోళ్లలో ఒకటి ఇలా అంది,
"చెలులారా, వాడుకప్రకారం నేను వెళ్లి పట్టణంలో విశేషాలు తెలుసుకుని వస్తాను.
రాజు నిద్రపోతున్నాడు. నిద్రలో ఒకవేళ కదిలితే నా వైపు వంగిపోకుండా మీరే భరించాలి".
ఆ కోడు పట్టెనుంచి కిరకిరమని వదిలించుకుని రివ్వున ఎగిరి వెళ్లిపోయింది.
రెండవ జాము మొదలవుతుందనగా అది తిరిగివచ్చి తన స్థానంలో నిలిచింది.
ఏమి విశేషం కనపడిందో చెప్పమని మిగిలిన మూడు కోళ్లూ దాన్ని అడిగాయి.
అప్పుడు ఆ మొదటి కోడు ఇలా చెప్పింది,
"నేను పట్టణమంతా తిరిగి తూర్పువీధికి చేరాను.
అప్పటికి ఈ ఊరివాళ్లు తింటూ, నిద్రపోతూ, నిద్రరాక లోకాభిరామాయణం చెప్పుకుంటూ ఉన్నారు.
పెద్దవిశేషాలేవీ కనపడలేదు. ఆ తూర్పువీధిలో ఒక గుడిమంటపంలో కొద్దిసేపు ఆగాను.
ఐదారుగురు మనుషులు వస్తున్నట్లు సవ్వడి అవటంతో ఒక రాతిస్తంభం వెనుక దాక్కున్నాను.
పెద్ద ఆకారాలతో, దృఢమైన శరీరాలతో, చేతిలో ఖడ్గాలతో వాళ్లు గుడిలోకి చేరుకున్నారు.
వారిలో ఒకడు ఇలా అన్నాడు,
'మిత్రులారా, మన రాజు వీరవర్మ ఈ ఊరి శత్రుంజయుడిని చంపటానికి మనల్ని పంపి వారం రోజులయింది.
మనకు సాధ్యం కావటం కాలేదు. తగిన సమయం దొరకటం లేదు'.
ఇంతలో ఇంకొకడు,
'సమయం కోసం వేచి ఉంటే ఎప్పటికీ మన పని జరగదు.
ఈ రాజుకు వేట అంటే ప్రాణం.
వేషాలలో రేపు సభకు వెళ్లి, మేము గడితేరిన వేటగాళ్లము, దేవర మాతో అడవికి వచ్చి మా ప్రావీణ్యం చూడాలి, అని అడుగుదాము.
అడవిలో శత్రుంజయుడిని సులువుగా చంపవచ్చు',
అని అన్నాడు.
ఇలా నిర్ణయించుకుని వాళ్లు వెళ్లే సమయానికి నా జాము ముగిసింది, తిరిగివచ్చాను.
వాళ్ల వల్ల ఈ రాజుకు ఏమి ప్రమాదం జరుగుతుందో అని చింతగా ఉంది".
ఇంతలో రెండవ కోడు ఎగిరివెళ్లి మూడవ జాము సమయానికి తిరిగివచ్చి, ఇలా చెప్పసాగింది,
"నేను ఊరంతా తిరిగి దక్షిణపువాడలో ప్రవేశించాను.
ఈ సమయానికి వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అందరూ నిద్రపోతున్నారు.
ఇలాంటి సమయంలో ఒక యువతి జుట్టువిరబోసుకుని గోడుగోడుమని ఏడుస్తూ నా ముందునుంచి వెళ్లటం చూసి ఆశ్చర్యపోయాను.
పరుగున తన దగ్గరకు వెళ్లి,
'అమ్మా, ఇంత రాత్రిపూట ఒంటరిగా ఎటు వెళ్తున్నావు?
నువ్వు ఏడవటానికి కారణమేమిటి?'
అని అడిగాను. నేను మానవ వ్యక్తిని కాకపోవటం వల్ల తన వృత్తాంతం నాకు చెప్పవచ్చని నిర్ణయించి,
'నేను ఈ పట్టణాన్ని పాలించే గ్రామదేవతను.
కాళికను. నాకు ప్రతి ఏడూ ప్రీతితో ఉత్సవాలు జరిపించే శత్రుంజయుడికి త్వరలో సర్పగండం ఉంది.
అదీ మరొక ఐదురోజుల్లో జరగబోతోంది.
అందువల్ల బాధపడుతున్నాను',
అని చెప్పింది.
పాముకాటు తర్వాత రాజును బ్రతికించే ఉపాయం లేదా అని నేను అడిగాను.
ఆమె,
'ఎందుకు లేదు?
శత్రుంజయుడి తోటలోనే పడమటివైపు ఒక పుట్ట ఉంది.
దానిమీద పెరుగుతున్న తీగను తవ్వి తెచ్చి, నూరి, నీళ్లతో ఇస్తే తిరిగి జీవిస్తాడు.
కానీ ఈ రహస్యం మానవులకు తెలిసేదెలాగ?'
అని అంది.
ఇంతలో మూడవజాము మొదలవుతోందని గమనించి వచ్చేశాను".
రాజుకు సర్పగండం ఉందన్న విషయం తెలిసి మిగలిన మూడు కోళ్లు కూడా చాలా బాధపడ్డాయి.
Saturday, October 31, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment