అది రాతి నంది కాదు.
రాగిరేకుతో తయారుచేసినది.
శిల్పి ఎంతో చాతుర్యంతో దాన్ని నిర్మించి, ఎందుకో వెనుక భాగాన ఒక రంధ్రం ఉంచాడు.
బోలుగా ఉండటమేగాక, రంధ్రం కూడా ఉండటంతో కుబేరగుప్తుడి రాయి తగలగానే నందినుంచి ధణధణమని శబ్దం వచ్చింది.
కుబేరగుప్తుడు అది విని,
"ఓహో, నంది శివుడి ఆజ్ఞ ప్రకారం డబ్బు తెచ్చాడు.
నాకు ఇవ్వటం ఇష్టం లేక పొట్టకింద దాచిపెట్టుకున్నాడు.
రాయి తగలగానే దొంగతనం తెలిసింది.
దొంగా, ఎంత మోసగాడివిరా, వదిలిపెడతానా, ఎవడి అబ్బ సొమ్మని దాచుకున్నావు",
అని తిడుతూ నందిని సమీపించాడు.
విగ్రహాన్ని కిందికి తోసి డబ్బు తీసుకుందామని ప్రయత్నించాడు కానీ నంది దృఢంగా ఉంది.
తోయటానికి పట్టు దొరుకుతుందేమోనని వెతికాడు.
తోక కింద ఉన్న రంధ్రం చేతికి తగిలింది.
లోపల చేయి పెట్టి డబ్బులు ఉన్నాయో లేవో చూద్దామని ప్రయత్నించాడు.
చేయి మొత్తం లోపల పెట్టి నాలుగు వైపులా వెతికాడు కానీ డబ్బులు లేవు!
కుబేరగుప్తుడు తెల్లబోయి ఇక చేసేదేమీలేక చేయి బయటికి తీయబోయాడు.
పాపం, చేయి వెనక్కి వచ్చింది కాదు.
కొంచెం సేపు గుంజి చూశాడు.
మోచేయి వాచింది కానీ చేయి బయటికి రాలేదు.
"ఓరి నందిగా!
డబ్బు మాట తర్వాత.
ముందు నా చేయి విడువు.
వదులు, వదులు",
అని నందీశ్వరుడే తన చేయి పట్టుకున్నట్లు భ్రమపడి, తిట్టి, బ్రతిమాలి, కొట్టి, పెనుగులాడాడు.
ఎంతకీ చేయి రాదే!
కుబేరగుప్తుడు ఇలాంటి స్థితిలో ఉండగా, అంతకు ముందు ఎంత వేడుకున్నా పలకని శివలింగం నుండి,
"నందీ!", అని వినపడింది.
కుబేరగుప్తుడి ఆశ్చర్యం తీరకముందే, అంతవరకూ మూగగా ఉన్న ఆ రాతి నంది,
"దేవా! ఆనతి ఇవ్వండి",
అని సమాధానం ఇచ్చింది.
"ఈ సాయంత్రంలోగా వేదశర్మకు చేరవలసిన పదివేలు చేరాయా?"
"స్వామీ, ఈ మధ్యాహ్నమే రెండువేలు ఇప్పించాను.
మిగిలిన ఎనిమిది వేలు కూడా ఇవ్వమని ఈ వర్తకుడిని పట్టుకుని ఉన్నాను.
ఇవ్వను అని గింజుకుంటున్నాడు.
ఎంత లాగినా ఇవ్వక తప్పదు.
ఇంకో ఘడియలో కాసు కూడా కొరతలేకుండా ఇప్పిస్తాను",
అని పలికింది.
ఈ మాటలు వినగానే కుబేరగుప్తుడి కోపం, దుఃఖం, రోషం అన్నీ ఒకేసారి కలిగాయి.
"ఛీ, మోసగాడా,
రెండువేలు ఇప్పించావా?
ఇంకో ఎనిమిది వేలు కూడా నా ద్వారా ఇప్పిస్తావా?
ఇదా నీ గొప్పతనం?
పోయిన డబ్బులు పోయాయి గానీ, మరో ఎనిమిది వేలు ఇచ్చేవాడెవడు? నీ తరమేనా?
నా చేయి వదులు, ఇక చాలు
", అని విడిపించుకోవటానికి మళ్లీ ప్రయత్నించాడు.
ఇంతలో దీపం వెలిగించటానికి గుడి తలుపులు తీసిన అర్చకుడు, లోపలి శబ్దాలు విని,
"అయ్యో, గుడిలో భూతం చేరింది.
నన్ను చంపక వదలదు.
ఊపిరి ఉంటే నువ్వులు అమ్మి అయినా బ్రతకవచ్చు",
అని ధర్మకర్త ఇంటికి పరుగున వెళ్లాడు.
ధర్మకర్త అతడి మాటలు విని,
"దేవళంలో భూతమేమిటయ్యా?
ఏమి శబ్దం విన్నావో.
సరే, తెలుసుకుందాం పద",
అని నలుగురు మనుషులను కూడా వెంటవేసుకుని గుడికి వెళ్లాడు.
లోపల నందిలో చేయి పెట్టి ఉన్న కుబేరగుప్తుడిని చూసి ధర్మకర్త ఆశ్చర్యపోయాడు.
ఏమి జరిగిందో చెప్పటానికి ముందు సిగ్గుపడినా, వృత్తాంతమంతా చెప్పి,
"రెండువేలు పోతే పోయాయి.
ఇంకో ఎనిమిది వేలు కాదు కదా, చిల్లి గవ్వ కూడా ఇవ్వను",
అని కుబేరగుప్తుడు శపథం చేశాడు.
ఇదంతా మెల్లగా ఊరందరికీ తెలిసి అందరూ గుడిచుట్టూ చేరారు.
ఒక్కొక్కరూ ఒక్కో ఉపాయం ఆలోచించి చెప్పసాగారు.
ఇంతలో ఒక బుద్ధిమంతుడు,
"వేదశర్మను పిలిపించి, కుబేరగుప్తుడి చేత ఎనిమిదివేలు ఇప్పించండి.
ఒకవేళ చేయి తిరిగిరాకపోతే డబ్బులు తిరిగి తీస్కోవచ్చు", అన్నాడు.
ఇది చాలామందికి సబబుగా తోచినా కుబేరగుప్తుడు ఒప్పుకోలేది.
తండ్రి బాధ చూడలేక కుబేరగుప్తుడి కుమారుడే వేదశర్మను పిలిపించి ఎనిమిది వేలు సమర్పించాడు.
మరుక్షణమే కుబేరగుప్తుడి చేయి బయటికి వచ్చేసింది!
ఈ వింత చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
కుబేరగుప్తుడు మాత్రం కోపంతో కుమిలిపోయి కొన్ని రోజుల తర్వాత మనుషులను పెట్టి, ఆ గుడినుండి శివలింగాన్ని, నందిని పెకలింపజేసి, ఊరి బయట ఒక అగాధంలో విసిరివేయించాడు. మరునాడు ఇది తెలిసిన గ్రామప్రజలు అతడిని విచారింపబోగా, అతడు ఆ ముందునాటి రాత్రే ఉరివేసుకుని చనిపోయినట్లు తెలిసింది.
మరో లింగం స్థాపించాలని ప్రయత్నించినా అనేక అంతరాయాల వల్ల అది జరిగింది కాదు.
క్రమంగా ఆ గ్రామం క్షీణించింది. తర్వాత వచ్చిన వాళ్లు దూరంగా నివాసం ఏర్పరచుకున్నారు.
ఈ గుడి ఇంత సుందరంగా ఉన్నా పూజ, అర్చనల వంటివి లేకపోవటానికి ఇదే కారణం,
అని కథ ముగించాడు.
Saturday, October 10, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment