Saturday, August 29, 2009

మొదటి మకాము - సుందరీమణి సత్యశీలుల కథ - 5

లోపల ఉన్న సత్యశీలుడు, వీరశేఖరుడు తమకున్న సైన్యంతో వారి దాడిని ఆపలేకపోయారు.
శత్రుసేనలు కోటలో చొరబడ్డాయి.
వీరశేఖరుడు ప్రాణాలు కాపాడుకోవటం కోసం చనిపోయిన శవాల మధ్యలో దాక్కున్నాడు.
సైనికులు సత్యశీలుడిని బంధించి చక్రవర్తి ముందు నిలిపారు.
అంతఃపురం గాలించినా సుందరీమణి కనపడలేదని ప్రతాపవర్ధనుడికి తెలిపారు.
ప్రతాపవర్ధనుడు కోపంతో, "ఓరీ, సుందరీమణిని ఎక్కడ దాచావు? నా ఆధిపత్యం అంగీకరించి ఆమెను అప్పగిస్తే నీ రాజ్యం తిరిగి ప్రసాదిస్తాను. లేకపోతే నీ కండలు తరిగి కాకులకు వేస్తాను", అని బెదిరించాడు. కానీ సత్యశీలుడు భయపడక, "నీచుడా, నువ్వు చక్రవర్తి పదవికి తగవు. నాశనమవుతావు", అని నిందించసాగాడు.

ఆ మాటలకు ప్రతాపవర్ధనుడు కత్తిదూసి సత్యశీలుడి తల నరకబోయాడు.
కానీ మంత్రి విశ్వనాథుడు అతడిని ఆపి, "ఇతడిని చంపితే సుందరీమణికి వైధవ్యం కలుగుతుంది. చక్రవర్తి అలాంటి స్త్రీని చేపట్టరాదు.
ఎప్పటికైనా ఆమె మనకు చిక్కుతుంది. సత్యశీలుడు బతికుండగానే ఆమెను చేపట్టటం గొప్పతనం", అని బోధించాడు.

ఇది యుక్తంగా తోచి, ప్రతాపవర్ధనుడు శివవర్మ అనేవాడిని విజయపురంలో తన ప్రతినిధిగా నియమించి,
సత్యశీలుడిని తనతో కమలాకరపురానికి తీసుకువచ్చి కారాగారంలో బంధించాడు.
సుందరీమణిని కనిపెట్టి తెచ్చినవారికి గొప్ప బహుమానం ప్రకటించాడు.
ఆ ఆశకులోనై చాలామంది వెతికినా ఆమె జాడ తెలిసింది కాదు.

ఇటువంటి సమయంలో ధనంజయుడనే యువకుడు తన బుద్ధిబలం ప్రదర్శించి కొలువులో స్థానం సంపాదించాడు.
కొద్దికాలంలోనే ప్రతాపవర్ధనుడికి అత్యంత ఆప్తుడయ్యాడు. అతడి మాటను చక్రవర్తి దైవవాక్యంలా పాటించసాగాడు.
ధనంజయుడు సుందరీమణిని వెతికించటం కోసం ప్రబలప్రయత్నం మొదలుపెట్టాడు.
ఇది తెలిసిన ప్రతాపవర్ధనుడు ఇంకా సంతోషించాడు.

ఇది జరిగిన కొన్నిరోజులకు జ్ఞానసిద్ధి అనే యోగి, తన శిష్యులతో కమలాకరపురంలో ప్రవేశించి,
ఊరిబయట శివాలయంలో మకాము చేశాడు. అది మొదలు ఆ ఊరి ప్రజలు అతడిని మహాత్ముడని పూజించసాగారు.
అతడు త్రికాలవేది అని పేరుపడటంతో జనం గుంపులు గుంపులుగా అతడి దర్శనం చేసుకోవటం ప్రారంభించారు.

ఒకరోజు ధనంజయుడు ఆ యోగి మహత్యం ప్రతాపవర్ధనుడికి తెలిపి, సుందరీమణి గురించి అతడిని అడిగితే ఫలం ఉండవచ్చని సూచించాడు. ప్రతాపవర్ధనుడు ఆ ప్రకారమే జ్ఞానసిద్ధిని కలిసి, ప్రార్థించి, తన పరిస్థితి తెలిపాడు. ఆ యోగి అప్పుడు ఇలా అన్నాడు,
"మహారాజా, మరో వారం రోజుల్లో నీ కోరిక తీరుతుంది. నువ్వు ఒక రాజును బంధించి ఉన్నావు. ఆ రాజును పట్టి తెచ్చేటప్పుడు అతడి మంత్రి అక్కడ లేడు. ఆ మంత్రికి విషయం తెలిసి, ఒక ఆడదానికోసం రాజ్యం వదిలి చెరసాలలో ఉండటం బుద్ధిమంతుల లక్షణం కాదని, ఆమె ఎక్కడుందో కనిపెట్టి, మీకప్పగించి, తన రాజును విడిపించుకోవాలనుకుంటున్నాడు".

ఇది విని ప్రతాపవర్ధనుడికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు.
ఇక ప్రతిరోజూ జ్ఞానసిద్ధిని దర్శించుకోసాగాడు.
ఒక వారం గడిచింది.

Saturday, August 22, 2009

మొదటి మకాము - సుందరీమణి సత్యశీలుల కథ - 4

ఇంతలో అర్ధరాత్రి అయింది.
ఒక యువకుడు ముందు నడుస్తుండగా నలుగురు బోయీలు ఒక పల్లకీని మోస్తూ కోట వెనుక వాకిలి నుండి బయటికి వచ్చి సైన్యం మధ్యలోనుండి వెళ్లసాగారు.
వారిని ఒక సేనాని అడ్డగించి, రహస్యంగా ఎవరో కోట నుంచి బయటికి వస్తున్నారని వీరశేఖరుడికి వార్త పంపాడు.
వీరశేఖరుడు హుటాహుటిన అక్కడికి చేరి విచారణ ప్రారంభించాడు.

అప్పడు పల్లకీ ముందు ఉన్న యువకుడు,
"అయ్యా, మేము ఈ ఊరివాళ్లం కాము. ఇక్కడికి ఆమడ దూరంలోని గ్రామవాసులము.
ఈ పల్లకీలో ఉన్న యువకుడికి కడుపు ఉబ్బరం రావటం వల్ల విజయపురంలోని వైద్యుడి దగ్గరకు వచ్చాము.
రాగానే యుద్ధం మొదలవటం వల్ల ఈ కోటలో చిక్కుపడ్డాము.
ఈ ఊరివైద్యానికి గుణం కనపడక ఇంకెక్కడైనా చికిత్స దొరుకుతుందేమోనని వెళ్తున్నాము.
శత్రుసైనికులు ఆపుతారని తెలిసినా, రోగిని చూపి బతిమాలుదామని బయలుదేరాము.
ఈ ఊరితో, రాజుతో, యుద్ధంతో మాకు సంబంధమే లేదు.
ఇతడిని మీరు పరీక్షించి మమ్మల్ని విడిచిపెట్టి ప్రాణదానం చేయండి", అన్నాడు.

వీరశేఖరుడు కొంచెం ఆలోచించి, పల్లకీలోకి తొంగిచూసి, బాధతో మూల్గుతున్న రోగిని గమనించి, మిగిలిన సేనాపతులతో,
"నిజమే, పొట్ట పెరిగి ఉండటం స్పష్టంగా కనపడుతోంది.
వీరివల్ల మనకు ప్రమాదం ఉన్నట్లు అనిపించటం లేదు. విడిచిపెట్టండి", అని ఆజ్ఞాపించాడు.
వాళ్లు బయలుదేరగానే వీరశేఖరుడు మిగిలిన సైనికులను వారివారి స్థానాలకు తిరిగి పంపించాడు.

మరుసటిరోజు ఉదయం ప్రతాపవర్ధనుడు తన సేనాపతులతో వీరశేఖరుడిని పిలిపించాడు.
వాళ్లు వచ్చి,
"మహారాజా, అర్ధరాత్రి వరకు వీరశేఖరుడు కోట చుట్టూ తిరుగుతూ ఉన్నాడు కానీ తరువాత నుండి కనిపించటం లేదు", అని
విన్నవించారు.

ప్రతాపవర్ధనుడు, "ఓహో, మోసపోయాము. ఆ వచ్చినవాడు వీరశేఖరుడు కాదు. శత్రువర్గం వాడెవడో వేషంలో వచ్చి పని సాధించుకుని వెళ్లిపోయాడు", అన్నాడు. అప్పుడు అతడి సేనానులు రాత్రి జరిగింది ప్రతాపవర్ధనుడికి వివరించారు. జరిగిన దానికి చింతించటం వ్యర్ధమని, కోటగోడలు కూల్చి విజయపురంలో ప్రవేశించమని ప్రతాపవర్ధనుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు.

Saturday, August 15, 2009

మొదటి మకాము - సుందరీమణి సత్యశీలుల కథ - 3

ఇంతలో, సుందరీమణి చూలుదాల్చి ఎనిమిది నెలలు గడిచాయి.
వసుదేవుడికి మరో గ్రామానికి వెళ్లవలసిన అవసరం వచ్చి, జయపాలుడనే రెండవ మంత్రిని తను లేని సమయంలో ప్రభువును రక్షించమని నియమించాడు. ఇది ఎంత రహస్యంగా జరిగినా వార్త ప్రతాపవర్ధనుడికి చేరిపోయింది. చక్రవర్తి వెంటనే విజయపురాన్ని చుట్టుముట్టి, నగరానికి రాకపోకలు నిర్బంధించి, యుద్ధానికి సిద్ధమయ్యాడు.

సైన్యమంతా కోటలో లేకపోవటం, వసుదేవుడు గ్రామానికి వెళ్లటం వల్ల సత్యశీలుడు నిస్సహాయుడై, ఉన్న కొద్ది సైన్యంతోనే ప్రతాపవర్ధనుడిని ఎదుర్కోమని తన సేనాధిపతి వీరశేఖరుడిని ఆజ్ఞాపించాడు. వీరశేఖరుడు ఎంత తెలివిగా యుద్ధం చేసినా సైన్యం తక్కువ ఉండటం వల్ల ప్రతాపవర్ధనుడి విజయం తథ్యంగా కనపడసాగింది. సాయంకాలమయ్యేసరికి ప్రతాపవర్ధనుడు యుద్ధం నిలిపి, సైన్యాన్ని విశ్రాంతి తీసుకోమని ఆజ్ఞాపించాడు. మరునాడు కోటలో ప్రవేశించి రాణిని చేపట్టవచ్చని నిశ్చయించి తన గుడారానికి చేరాడు.

ఆ రోజు రాత్రి, గుర్రం మీద ఒక రౌతు ప్రతాపవర్ధనుడి గుడారం వైపు వెళ్లటం చక్రవర్తి సైనికులు గమనించారు.
వాళ్లు అతడిని ఆపినప్పుడు ఆ రౌతు, "నేను చెప్పబోయే విషయం రాజుగారితో తప్ప చెప్పను. నా దగ్గర ఆయుధాలేమీ లేవు. సంశయం లేకుండా నన్ను మీ చక్రవర్తి దగ్గరకు తీసుకువెళ్లండి", అని చెప్పాడు. ఆ రౌతును పరీక్షించి సైనికులు అతడిని చక్రవర్తి ముందు నిలబెట్టారు.

అప్పుడు ఆ రౌతు, "సార్వభౌమా, నేను సత్యశీలుడి సేనాధిపతి వీరశేఖరుడిని. ఈనాటి యుద్దం ముగిసిన తరువాత, గెలవటం సాధ్యం కాదని నేను సత్యశీలుడికి తెలిపాను. యుద్ధం, విరోధం ఆపి, సుందరీమణిని మీకు అప్పగించి సంధి చేసుకోమని వివరించాను. నా మాటలకు కోపగించిన ఆ వివేకహీనుడు నా ముఖాన ఉమ్మి నన్ను సభనుండి వెళ్లగొట్టాడు. నా దుస్థితిని మీకు విన్నవించి శరణుకోరటానికి వచ్చాను", అన్నాడు.

ఇది విన్న ప్రతాపవర్ధనుడికి అనుమానం కలిగినా, విజయపురం రహస్యాలు తెలిసిన సేనాపతి తమ దగ్గర ఉండటం మేలని నిర్ణయించి,
"వీరశేఖరా, రేపు కోటలో ప్రవేశించి, నిన్ను అవమానించిన వాడిని పట్టితెచ్చి, సుందరీమణిని నాకు అప్పగించు. నీకు గొప్ప బహుమానం దొరుకుతుంది. వెళ్లి మన పనులు నిర్వహించు", అని తన సేనానాయకులను పిలిచి, "ఇతడిని మీకు అధిపతిగా నియమిస్తున్నాను. ఇతని ఆజ్ఞను పాటించండి", అని ఆజ్ఞాపించాడు. వీరశేఖరుడు తన పక్షంలో చేరటంతో విజయం తనదేనని భావించి, వసుదేవమంత్రి తిరిగివచ్చేలోపే సుందరీమణితో కమలాకరపురానికి వెళ్లవచ్చని ఆలోచిస్తూ ప్రతాపర్ధనుడు నిద్రపోయాడు.

వీరశేఖరుడితో యుద్ధం చేసిన ప్రతాపవర్ధనుడి సైనికులు కోట చుట్టూ నిద్రపోతున్నారు. ఆ రాత్రే చక్రవర్తి దగ్గర చేరిన వీరశేఖరుడు సర్వసైన్యాధిపత్యం వహిస్తూ, కోట నాలుగు వైపులా ప్రతాపవర్ధనుడి సేనాపతులను నిలిపి, గుర్రమెక్కి కోట చుట్టూ తిరుగుతూ ఎవరూ లోపలికి, బయటికి రాకుండా కట్టుదిట్టం చేశాడు.

Saturday, August 8, 2009

మొదటి మకాము - సుందరీమణి సత్యశీలుల కథ - 2

"గుణాకరా, ఈ ప్రాంతంలో పూర్వం విజయపురం అనే పట్టణం ఉండేది.
దానికి సత్యశీలుడనేవాడు రాజు. సత్యశీలుడు ప్రతాపవర్ధనుడనే చక్రవర్తికి సామంతుడు.
ప్రతాపవర్ధనుడు కమలాకరము అనే ఒక గొప్ప పట్టణాన్ని పరిపాలించేవాడు.
ఆయనకు విశ్వనాథుడనే బుద్ధిశాలి మంత్రి.
ప్రతాపవర్ధనుడు చాలామంది రాజులను గెలిచి, సామంతులుగా చేసుకొని, నిరంకుశంగా వాళ్ల దగ్గర కప్పం వసూలు చేసేవాడు.

అలాంటి మరొక సామంతుడు ఘూర్జర రాజ్యాధిపతి హేమవర్మ.
ఆయన కూతురైన సుందరీమణి ఎన్నో శుభలక్షణాలు గలది.
యుక్తవయస్కురాలైన ఆమెకు వివాహం చేయాలని హేమవర్మ వరులను వెదకసాగాడు.
కానీ, విజయపురం రాజైన సత్యశీలుడి గురించి విన్న సుందరీమణి, అతడినే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది.
సత్యశీలుడికి రహస్యంగా లేఖ రాసి అతడికి కూడా తనను వివాహమాడాలనే కోరిక ఉందని తెలుసుకుంది.

ఈలోగా ప్రతాపవర్ధనుడు సుందరీమణిని గురించి విని, ఆమెతో తనకు వివాహం జరిపించమని హేమవర్మకు ఒక ఉత్తరం పంపాడు.
చక్రవర్తిని తిరస్కరించలేని హేమవర్మ సుందరీమణికి ఆ లేఖ చూపించగా, ఆమె సత్యశీలుడి గురించి తండ్రికి తెలిపింది.
కుమార్తెకు వ్యతిరేకంగా చేయటం ఇష్టం లేక, హేమవర్మ ప్రతాపవర్ధనుడికి విషయం తెలియజేశాడు.

అందుకు ప్రతాపవర్ధనుడు మండిపడి, "సుందరీమణి సత్యశీలుడిని పెళ్లాడినా ఆమెను విడువక, సత్యశీలుడిని రాజ్యభ్రష్టుని చేసి, కారాగారంలో ఉంచి, ఆమెను వశం చేసుకొంటాను", అని సభలో ప్రకటించాడు. అప్పటినుండి విజయపురాన్ని ఆక్రమించుకోవటానికి సమయం చూడసాగాడు.

ఇంతలో కొంతకాలానికి సుందరీమణి సత్యశీలుల వివాహం జరిగి, ఆమె భర్తతో విజయపురానికి రాణిగా వచ్చింది.

సత్యశీలుడి మంత్రి వసుదేవుడు.
భట్టిచాణక్యయుగంధరులను మించినవాడు.
అతడి చాకచక్యానికి భయపడి శత్రువులు విజయపురం వంక కన్నెత్తికూడా చూసేవారు కాదు.
ప్రతాపవర్ధనుడు సుందరీమణికోసం ప్రబలసైన్యంతో రెండు మూడు మార్లు దండెత్తి వచ్చినా వసుదేవుడి తంత్రాలకు పరాజయం పాలయ్యాడు. సత్యశీలుడు ప్రతాపవర్ధనుడికి సామంతుడైనా, చక్రవర్తి అక్రమంగా దండెత్తిన కారణంగా వసుదేవుడి సలహామేరకు కప్పం కట్టటం నిలిపి స్వతంత్రంగా వ్యవహరించటం మొదలుపెట్టాడు. వసుదేవుడి పనులకు కోపం వచ్చినప్పటికీ, ప్రతాపవర్ధనుడు ఏమీ చేయలేక, ఆ మంత్రి లేని సమయంలో పగదీర్చుకోవాలని ఎదురుచూడసాగాడు.

Saturday, August 1, 2009

మొదటి మకాము - సుందరీమణి సత్యశీలుల కథ - 1

యోగానందుడు, గుణాకరుడు ఒక పల్లె బయట, ఏటి పక్కనున్న ఒక మర్రిచెట్టు నీడలో విడిది చేశారు. అప్పుడు యోగానందుడు తమ ఇద్దరికీ భోజనసామగ్రి కొనటానికి సరిపోయే ఒక నాణెం గుణాకరుడికి ఇచ్చి, "గుణాకరా, గ్రామంలోకి వెళ్లి మనకు ఈ పూటకు కావలసిన పప్పు, బియ్యం కొని, ఎవరినైనా అడిగి వంటపాత్రలు తీసుకురా", అని చెప్పాడు.

వట్టిచేతులతో ఉన్న యోగి తటాలున నాణెం ఇవ్వటం చూసి గుణాకరుడు ఆశ్చర్యపోయాడు. యోగానందుడి మహిమను కొనియాడి గ్రామానికి వెళ్లి దినుసులు కొన్నాడు. తను ఎవరో తెలియకపోయినా ఆ ఊరివారు వంటపాత్రలను సంశయం లేకుండా ఇవ్వటం కూడా యోగి ప్రభావమని భావించాడు. త్వరగా తిరిగివచ్చి, స్నానం చేసి, పొయ్యి ఏర్పరిచి, వంట చేశాడు.

ఇద్దరూ భోజనం చేసిన తర్వాత, చల్లని చెట్టు నీడలో విశ్రమించిన గురువు పాదాలు ఒత్తుతూ గుణాకరుడు, "మహాత్మా, ఈ గ్రామంలో ఒక వింత చూశాను. ఊరిమధ్యలో విశాలంగా కొంత ప్రదేశం ఉంది. అందులో రెండు శిలాస్తంభాలు ఒకదానికొకటి పది గజాల దూరంలో ఉన్నాయి. ఈ స్తంభాలపైన అడ్డంగా ఒక బండరాయి ఉంది. దూలంలా వేసిన ఈ బండరాయి మధ్యలో దగ్గర దగ్గరగా ఉన్న రెండు రంధ్రాలకు బలమైన ఇనుప గొలుసులు తగిలించి ఉన్నాయి.

ఈ రెండు గొలుసులూ తలకిందులుగా ఉన్న ఒకడి కాళ్లకు కట్టి ఉన్నాయి. అతడి స్థితికి నేను బాధపడ్డాను కానీ, దగ్గరకు వెళ్లి చూస్తే, అది మనిషి ఆకారంలో ఉన్న ఒక ఇనుప బొమ్మ మాత్రమే అని తెలిసింది. అది అలా ఉండటానికి కారణమేమిటని ఈ ఊరివారిని అడిగాను. వాళ్లు ఆ బొమ్మ ఎప్పటి నుంచో అలా ఉందనీ, తమ తాతలకు కూడా దాని వృత్తాంతం తెలియదనీ చెప్పారు.

నాకు ఆ బొమ్మ గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉంది! తమరు జ్ఞానదృష్టి గలవారు. ఈ విశేషమేమిటో వివరించమని ప్రార్థన", అని అడిగాడు.

యోగానందుడు జ్ఞానదృష్టితో ఆ వృత్తాంతం తెలుసుకొని ఇలా చెప్పనారంభించాడు.

కాశీరామేశ్వర మజిలీ కథలు

కాశీమజిలీ కథలతో మా ఇంట్లో ఒక పాత పుస్తకం ఉండేది.
ఇవి DD తెలుగులో అప్పట్లో వచ్చిన కథలు కాదు.
ముందు, వెనుక కొన్ని పేజీలు లేకపోవటం వల్ల పేరు, రచయిత, తేదీ, ప్రచురణ ఏమీ తెలియవు.
గ్రాంథికభాషలో (పేరోలగం లాంటి పదాలతో సహా) ఉన్న ఈ కథలు చాలా interesting గా, convoluted గా, sometimes naive గా, always amusing గా ఉండేవి.
తరువాత కాశీమజిలీ కథలు అని colloquial తెలుగులో కొన్ని పుస్తకాలు చూశాను కానీ, ఈ కథలు ఎక్కడా చూడలేదు.
ఆ పుస్తకం ఇప్పుడు నా దగ్గరే ఉండటంతో, ఆ కథలు కొంచెం వాడుక భాషలో తిరగరాద్దామని ఈ ప్రయత్నం.
Hope you enjoy the stories!